ఈటల రాజేందర్ వ్యాఖ్యలఫై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఫైర్

టీఆర్ఎస్ లీడర్లు బీజేపీ తో టచ్ లో ఉన్నారని..ఈ నెల 27 తర్వాత చాలామంది బిజెపి లో చేరబోతున్నారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల ఫై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ జేజమ్మ దిగి వచ్చినా.. మీ మోడీ, అమిత్ షా వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని అన్నారు. అనామకుడు ఈటలను మంత్రి చేస్తే ఇట్లేనా మాట్లాడేదన్నారు. అసలు నిన్ను ఎవడన్నా లీడర్ గా గుర్తిస్తారా అంటూ కామెంట్ చేశారు. నీకు దమ్ముంటే ఒక్కరన్న మా వాళ్ళు టచ్ లో వుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆధారాలు బయట పెట్టాలని బాలరాజు అన్నారు. తెలంగాణలో చిచ్చు పెడితే తగిన రీతిలో బుద్ది చెప్తామని ఆయన అన్నారు.

అంతకు ముందుకు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుతం మంచి రోజులు లేనందువల్లే చేరికలు లేవని.. 27 తర్వాత భారీగా చేరికలు ఉంటాయన్నారు. టీఆర్ఎస్‌లోని నేతలతో తనకు 20ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ తనతో టచ్‌లోఉన్నారని తెలిపారు.

మోడీకి అండగా నిలిచేందుకు, బీజేపీ జెండా ఎగురవేసేందుకు యువత, రైతులు, మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘటన మోదీకే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్న ఆయన.. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తమ పంచాయతీ సీఎం కేసీఆర్‌తో మాత్రమేనని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ అహంకారం భరించలేకే తాను బయటికి వచ్చేశానని, చాలామంది ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో ఉన్నారన్నారు.

SHARE