రాష్ట్రంలో 15 రోజులపాటు స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశాలు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 15 రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు.. మొత్తంగా 15 రోజుల పాటు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటల్లు సహా ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి జాలువారేలా, జాతీయ జెండా రెపరెపలాడేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. ప్రజలు, ఉద్యోగుల నడుమ సత్సంబంధాలు పెంపొందించే ఫ్రెండ్లీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న సీఎం… ఉద్యోగుల్లో కూడా దేశభక్తిని రగిలించే సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం రన్​లను నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎం కేసీఆర్… ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని ఉద్దీపన చేసే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలన్నారు. రోజువారీ షెడ్యూలు రూపొందించుకుని రెండు వారాల పాటు అమలు చేయాలని సూచించారు.

SHARE