కేటీఆర్ బర్త్ డే వేడుకలకు హాజరుకాలేదని ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

జులై 24 న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నేతలు బర్త్ డే వేడుకలు జరిపారు. కాగా ఈ వేడుకలకు హాజరుకాలేదని ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు సంబరాలకు ముగ్గురు ఉద్యోగులు హాజరుకాలేదంటూ వారికి నోటీసులు జారీ చేసారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కేసీఆర్ కుటుంబం పెంచిపోషిస్తున్న రాచరికపు పోకడలు తెలంగాణలో మరో స్థాయికి చేరాయని ..కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు ఎందుకు హాజరుకాలేదంటూ తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని సునీల్ దేవధర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని తెలిపారు. అంతేకాదు, సదరు ఉద్యోగులకు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన మెమోను కూడా సునీల్ దేవధర్ పంచుకున్నారు.

బెల్లంపల్లి ప్రభుత్వం ఆసుపత్రిలో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు టి.రాజేశ్వరి (సీనియర్ అసిస్టెంట్), ఎస్.పున్నమ్ చందర్ (జూనియర్ అసిస్టెంట్), ఏ.మోహన్ (సిస్టమ్ మేనేజర్) గైర్హాజరయ్యారంటూ ఆ మెమోలో ఆరోపించారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

SHARE