రేవంత్ రెడ్డి ఫై రాజగోపాల్ ఆగ్రహం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ కి , మ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఫై రేవంత్ రెడ్డి..పలు వ్యాఖ్యలు చేయడం ఫై రాజగోపాల్ ఫైర్ అయ్యారు. పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని పిరికోడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్‌కి కాకుండా చంద్రబాబుకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు.

రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబును, టీడీపీని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు వారిని పొగడ్తలతో ముంచెత్తడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సొంత పార్టీ, కార్యకర్తల కోసం ఏనాడూ చిటికెడు సాయం చేయని రేవంత్‌ రెడ్డి.. పేదల కోసం పాటుపడే తనను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన రేవంత్ రెడ్డి.. ఆ డబ్బుతోనే పీసీసీ పదవి కొనుక్కున్నాడని ఆరోపించారు. తాను బీజేపీకి అమ్ముడుపోయానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, నిరూపించలేకపోతే రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. దొంగ, బ్లాక్‌మెయిలర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిగ్గు పడుతున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరినా రేవంత్.. ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సీఎం అయితే సీమాంధ్ర కాంట్రాక్టర్లు, వ్యాపారులు తెలంగాణలో మళ్లీ పాగా వేయొచ్చని ఆశలు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకవేళ రేవంత్ సీఎం అయితే తెలంగాణలో పెత్తనమంతా మళలీ సీమాంధ్రుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

SHARE