క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిథాలీ

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) ఆమెదే. 232 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 7805 పరుగులు చేశారు. 7వేల పరుగులు సాధించిన మైలు రాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషం. వన్డేల్లో 7 శతకాలు 64 అర్ధ శతకాలు చేసిన మిథాలీ.. టీ20 మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టారు. టీ20ల్లో 17 అర్ధశతకాలు నమోదు చేశారు. 89 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తంగా 2,364 పరుగులు సాధించారు.39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్లో తన సత్తా చాటారు.

ఈ సందర్భంగా మిథాలీ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇన్నేళ్ల పాటు మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పారు. గత 23 ఏళ్ల క్రికెట్ జీవితంలో ఎన్నో నేర్చుకున్నానని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని… ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని అన్నారు. అన్ని ప్రయాణాల మాదిరే ఈ ప్రయాణం కూడా ముగిసిందని చెప్పారు.

మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలి తెలిపారు. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

SHARE