సౌరవ్​ గంగూలీ బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నాడా..?

అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడుతున్నదని , అది కూడా బిజెపి లో చేరబోతున్నాడని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆయన చేసిన ట్వీటే. “1992లో క్రికెట్​లో అడుగుపెట్టాను. 2022తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నాటి నుంచి క్రికెట్​ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ మద్దతును నాకు అందించింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎందరికో ఉపయోగపడే ఓ పని ప్రారంభించాలని ఈ రోజు నిర్ణయించుకున్నా. నా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని దాదా ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షాతో ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా స‌న్నిహితంగా మెల‌గుతున్న గంగూలీ… నెల వ్య‌వ‌ధిలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రెండు ప‌ర్యాయాలు భేటీ అయ్యారు. గ‌త నెల 7న కోల్ క‌తా వెళ్లిన అమిత్ షా… గంగూలీ ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గంగూలీ ఇంటిలోనే అమిత్ షా భోజ‌నం చేశారు.

ఆ త‌ర్వాత ఇటీవ‌లే మ‌రోమారు అమిత్ షాను గంగూలీ క‌లిశార‌ట‌. ఇలా అమిత్ షాతో రెండు సార్లు భేటీ కావ‌డం, తాజాగా మ‌రింత మంది ప్ర‌జ‌ల‌కు సేవ చేసే దిశ‌గా కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్ట‌నున్నాన‌ని స్వ‌యంగా గంగూలీనే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే గంగూలీ.. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

SHARE