ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..! కప్ తీసుకెళ్ళేమా లేదా..అన్నట్లుంది గుజరాత్ టైటాన్స్ టీం. ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్ లో తలపడింది. టాస్ గెలిచిన రాజస్తాన్‌ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్‌ దశలో గుజరాత్‌ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్‌ 9 విజయాలతో రెండో స్థానం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్‌దే పైచేయిగా ఉండడం తో ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారా అని అంత ఆసక్తిగా ఎదురుచూసారు.

ఫైనల్ లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్ (39; 35 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. యశస్వీ జైస్వా్ల్‌ (22) , సంజూ శాంసన్‌ (14), దేవదత్‌ పడిక్కల్ (2), హెట్‌మెయర్‌ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్‌ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో మెరవగా.. సాయికిశోర్‌ రెండు, రషీద్‌ఖాన్‌, యశ్ దయాళ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు.

131 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్‌ ..18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించేసి టైటిల్ గెలుచుకుంది. తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 ఛాంపియన్స్‌గా నిలిచి ఓ కొత్త చరిత్ర సృష్టించింది. పదిహేనేళ్ల ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ తొలిసారి కప్ గెలవగా.. ఆ తర్వాత మరో కొత్త జట్టు టైటిల్ గెలిచిన దాఖలాలు లేవు. ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో రాజస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి కొత్త ఛాంపియన్‌గా అవతారమెత్తింది.

131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా 5 (7) పరుగులకే వెనుదిరగగా.. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాథ్యూ వేడ్ 8 (10) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దాంతో 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ హార్ధిక్ ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు గిల్, హార్దిక్ కలిసి 63 పరుగులు జోడించారు.

హార్దిక్ పాండ్యా 30 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. శుభమన్ గిల్, మిల్లర్ మరో వికెట్ పడకుండా 18.1 ఓవర్లలో 133 పరుగులతో రాజస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఐపీఎల్ 2022 ఛాంపియన్‌గా నిలిచింది.

SHARE