ఇంగ్లండ్ ఫై గ్రాండ్ విక్ట‌రీ సాధించిన టీమిండియా

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం జరిగిన తొలి వ‌న్డేలో టీమిండియా రికార్డు విజయం సాధించింది. కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన మొదటి మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైపోగా.. 111 పరుగుల లక్షాన్ని 18.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 114/0తో టీమిండియా ఛేదించేసింది.

భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/19) దెబ్బకి ఆరంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్ టీమ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (0), జానీ బెయిర్‌స్టో (7)తో పాటు జో రూట్ (0), బెన్‌స్టోక్స్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే.. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (30), మొయిన్ అలీ (14), డేవిడ్ విల్లే (21) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కనీసం 110 పరుగులైనా చేయగలిగింది. 111 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (58 బంతుల్లో 76 ప‌రుగులు) చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్‌కు జ‌త‌గా వ‌చ్చిన శిఖ‌ర్ ధావన్‌(31) నిల‌క‌డ‌గా రాణించి వికెట్ ప‌డిపోకుండా జాగ్ర‌త్త‌గా ఇన్నింగ్స్‌ను కాపాడాడు. రోహిత్ ధాటిగా ఆడుతుండ‌గా…ధావ‌న్ మాత్రం రొటేట్ చేస్తూ రోహిత్‌కు స‌హ‌కారం అందించాడు. వెర‌సి 18.4 ఓవ‌ర్ల‌లోనే వీరిద్ద‌రూ 114 ప‌రుగులు చేసి భార‌త్‌కు రికార్డు విజ‌యాన్ని అందించారు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే గురువారం సాయంత్రం 5:30 గంటలకి లార్డ్స్‌లో జరగనుంది.

SHARE