సఫారీ జట్టుపై టీం ఇండియా ఘనవిజయం ..

సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో సిరీస్‌ 2-2తో సమం అయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్య (46; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్ (55; 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. డసెన్‌ (20) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బవుమా (8) రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ విజయం సాధించింది.

లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదు. ఆరంభంలోనే భుజానికి గాయం అవడంతో సఫారీ సారధి టెంబా బవుమా (8) మైదానం వీడాడు. ఆ తర్వాత కాసేపటికే కమ్యూనికేషన్ సరిగా లేకపోవడంతో డీకాక్ (14) రనౌట్ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఖాతా తెరవని ప్రిటోరియస్ (0)ను ఆవేష్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. హెన్రిక్ క్లాసెన్ (8), డేవిడ్ మిల్లర్ (9) కూడా విఫలమయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాసీ వాన్ డర్ డస్సెన్ (20) కూడా ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్కో జాన్సెన్ (12), కేశవ్ మహరాజ్ (0)ను కూడా ఆవేష్ అదే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఈ విజయంతో 5 మ్యాచుల టీ20 సిరీస్ 2-2తో సమం అయింది. భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగాడు. చాహల్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

SHARE