ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహిళపై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. రైల్వే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్‌ స్టాఫ్‌కు సంబంధించిన చిన్న గదిలో 30 ఏళ్ల మహిళను బాధించి అత్యాచారం జరిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. హర్యాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఆమెకు రెండేళ్ల కిందట కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పటి నుండి ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. రైల్వేలో పని చేస్తున్నట్లుగా పరిచయం చేసుకున్న అతడు ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపాడు. అలా మాటలు కలిపాడు. ఏడాది కిందట ఆ మహిళ తన భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది.

శుక్రవారం సాయంత్రం సదరు వ్యక్తి ఆ మహిళకు ఫోన్ చేసి తన కుమారుడి బర్త్‌డే పార్టీ ఇస్తున్నానని చెప్పి ఆమెను ఢిల్లీకి ఆహ్వానించాడు. శుక్రవారం రాత్రి బాధితురాలు మెట్రో రైలులో కీర్తి నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆమెను పికప్ చేసుకొని నేరుగా ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ స్టాఫ్‌కు సంబంధించిన గదిలో కూర్చోబెట్టి కాసేపట్లో వస్తానని చెప్పి బయటికెళ్లాడు. కాసేపటి తర్వాత మరో వ్యక్తితో కలిసి వచ్చి గది తలుపు లోపలి నుంచి గడియ పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. మరో ఇద్దరు సిబ్బంది గది బయట ఉండి కాపలా కాశారని ఆమె వెల్లడించారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

SHARE