ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మంకీపాక్స్ అల‌ర్ట్ జారీ

మంకీపాక్స్ విషయంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి ఉదృతి పూర్తిగా తగ్గకముందే మరో మహమ్మారి భారత్ లో ప్రవేశించింది. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మంకీపాక్స్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే నాల్గు కేసులు వెలుగులోకి రాగా..తాజాగా తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌ కాలనీకి చెందిన ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్‌ వ్యాధి లక్షణాలు బయటపడటం కలకలం రేపింది.

ప్రస్తుతం వీరి శాంపిల్స్ పూణే ల్యాబ్ కు పంపించారు. ఈరోజు వీరి రిపోర్ట్ రానున్నాయి. ఇదిలా ఉంటె ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మంకీపాక్స్ అల‌ర్ట్ జారీ చేశారు. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆస్ప‌త్రుల్లో.. మంకీపాక్స్ రోగుల కోసం మంచాల‌ను రిజ‌ర్వ్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మరోపక్క మంకీపాక్స్​పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. 75 దేశాల్లో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాగే.. ఈ వ్యాధితో ఐదుగురు మరణించినట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్‌లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి వారం నుంచి జులై మొదటివారం వరకు ఈ వైరస్ విస్తరణ వేగం 77 శాతానికి పెరిగింది. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా గణనీయస్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్ ను డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుంటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్నారు. స్వలింగ సంపర్కుల్లో ఇది అత్యంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.

మంకీ పాక్స్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. కానీ సోకినవారికి బాగా సన్నిహితంగా మెలిగినా, తాకినా, వారి వస్తువులు, దుస్తులు ఉపయోగించినా.. వైరస్ సోకే అవకాశం ఉంటుంది. మంకీ పాక్స్ లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు మొదటి రకానివని, అది మరీ ప్రమాదకరం కాదని పేర్కొంది.

SHARE