రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తి

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. పార్లమెంటు భవనంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ ప్రారంభం అవగా.. సాయంత్రం 3-4 గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.

అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం ముఖాముఖి తలపడ్డారు. ముర్ముకు తగినంత మెజార్టీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

ఈ నెల 18 న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరిగింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. ఆమె 63 శాతానిపైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సమాచారం.

SHARE