వరవరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వరవర రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టు అధికార పరిధిలోని ప్రాంతం నుంచి వెలుపలికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా తెలిపింది.

వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్‌, అనిరుద్ధ బోస్‌, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విరసం నేత ఆరోగ్య పరిస్థితి, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, చార్జీషీట్‌ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది. అయితే, ముంబైలోని ఎన్‌ఐఏ కోర్ట్‌ అనుమతి లేకుండా ఆయన గ్రేటర్‌ ముంబయిని దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.

SHARE