మొదటి రోజు సోనియా ఈడీ విచారణ పూర్తీ..మళ్లీ 25 న రావాలని సమన్లు జారీ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ మొదటి రోజు పూర్తయింది. దాదాపు మూడు గంటలపాటు సోనియా ను విచారించిన అధికారులు..మళ్లీ 25 న హాజరుకావాలని సమన్లు జారీ చేసారు. ఆరోగ్య కారణాలతో(ఇటీవల కరోనా నుంచి కోలుకోవడం) ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని.. ఎక్కువ సేపు ఆమెను విచారించకుండా ఇంటికి పంపించారు.

మరోపక్క సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు నిరసనకు దిగాయి. ఢిల్లీ తో సహా పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోరాటం చేస్తున్నారు. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం, అజయ్​ మాకెన్, అధీర్​ రంజన్​ చౌదరి, మాణికం ఠాగూర్​, కె.సురేశ్​, హరీశ్​ రావత్​, శశి థరూర్​​ సహా పలువురిని బస్సుల్లోకి ఎక్కించి నిర్బంధించారు. సుమారు 75 మంది కాంగ్రెస్​ ఎంపీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో జూన్​ 8నే సోనియా విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూన్​ 2న ఆమెకు కరోనా సోకిన నేపథ్యంలో కొన్నిరోజులు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం.. జూన్​ 12న ఆస్పత్రిలో చేరారు. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా ఈడీని కోరారు. దీంతో ఆమెకు జులై 21 న హాజరు కావాలని ఈడీ నోటీసు జారీ చేసారు. ఈ క్రమంలో సోనియా ఈడీ ముందుకు హాజరయ్యారు.

SHARE