రేపు మరోసారి ఈడీ ముందుకు సోనియా

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు రేపు బుధువారం కూడా విచారించబోతున్నారు. జులై 21 న దాదాపు మూడు గంటల సేపు విచారించిన అధికారులు..ఈరోజు మంగళవారం మరోసారి ఆమెను దాదాపు ఆరు గంటలపాటు విచారించారు.

ఉదయం 11 గంటలకు… కొడుకు రాహుల్‌, కుమార్తె ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు సోనియా. ప్రియాంక అక్కడే ఉండగా రాహుల్‌ పార్లమెంటుకు వెళ్లిపోయారు. రెండున్నర గంటల పాటు సోనియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి సోనియా విచారణ మొదలుపెట్టారు. మొత్తంగా మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన అధికారులు రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసారు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు ఉన్న 90 కోట్ల రూపాయల అప్పును యంగ్ ఇండియాకు బదలాయించడంపై ఈడీ ప్రశ్నలు సంధించింది. యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న సోనియాకు 38 శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపై కూపీ లాగారు. సోనియా స్టేట్ మెంట్ ను మొత్తం రికార్డు చేశారు. రెండు రోజుల విచారణలో భాగంగా సోనియాను 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలనే సోనియాను అడిగినట్లు పేర్కొన్నాయి.

ఇక సోనియా ను ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. పార్లమెంటు నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

SHARE