పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం..

భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాల దృష్ట్యా పక్షపాత రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలను అధిగమించాలని పిలుపునిచ్చారు.

ప్రజాసంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాజకీయ పక్షాలకు సూచించారు. పార్లమెంటును ‘ప్రజాస్వామ్య దేవాలయం’ అని అభివర్ణించారు. ఉభయ సభల్లో చర్చలు జరిపేటప్పుడు సభ్యులు గాంధేయవాదాన్ని అనుసరించాలని రామ్ నాథ్ కోవింద్ హితవు పలికారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం (జులై 25)న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన ముర్ము.. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఘనవిజయం సాధించారు. దీంతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించే తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

SHARE