హాస్పటల్ లో పంజాబ్ సీఎం

పంజాబ్ సీఎం భగవంత్​ మాన్ కడుపు నొప్పితో ఢిల్లీ లోని అపోలో హాస్పటల్ లో చేరారు. కడుపునొప్పితో బాధపడుతున్న సీఎంకు ఇన్ఫెక్షన్​ అయినట్లు డాక్టర్స్ వెల్లడించారు. రీసెంట్ గా భగవంత్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్​ప్రీత్ కౌర్​ను సీఎం మాన్ వివాహమాడారు.

సీఎం భగవంత్ మాన్ ఇటీవల సుల్తాన్‌పూర్ లోధిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాళీ బెన్ నది ప్రక్షాళన 22వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కాళీ బెన్ నది నుంచి స్వయంగా గ్లాసు నీళ్లు తీసుకుని తాగారు. అనంతరం నది ఒడ్డున మొక్కలు నాటారు. కాళీ బెన్ నదిలో నీటిని తాగడం వల్లే భగవంత్ మాన్ అనారోగ్యం పాలయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిన ఆ నది నీళ్లు తాగడం వల్లే ఆయనకు కడుపునొప్పి వచ్చినట్లు చెబుతున్నారు. భగవంత్ మాన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేతలు ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య నిందితులైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడాన్ని సీఎం భగవంత్ మాన్ అభినందించారు. ఈ మేరకు బుధవారం (జూలై 20) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

SHARE