బీహార్‌ ముఖ్యమంత్రి గా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం

బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

బీహార్‌కు సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌డం నితీశ్‌కు ఇది ఎనిమిదోసారి. బీహార్‌కు డిప్యూటీ సీఎంగా తేజ‌స్వీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది రెండో సారి. గ‌తంలో నితీశ్ కేబినెట్‌లోనే డిప్యూటీ సీఎంగా కొన‌సాగిన తేజ‌స్వీ… జేడీయూతో విభేదాల కార‌ణంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొన్నాళ్ల‌కే ఆయ‌న రాజీనామా చేశారు.

నితీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు పర్యాయాలు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఏడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం.

SHARE