ఇండియా లో ఫస్ట్ మంకీ పాక్స్ మరణం ..

ఇండియా లో ఫస్ట్ మంకీపాక్స్‌ మరణం నమోదైంది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన యువకుడు(22) మంకీపాక్స్‌ కారణంగా ఆదివారం చనిపోయాడు. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. త్రిస్సూర్‌లోని పున్నియూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు యూఏఈ నుంచి తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు.

జులై 21 తేదీన యూఏఈ నుంచి 22 ఏళ్ల యువకుడు కేరళలోని త్రిసూర్‌ కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులకు తీవ్ర జ్వరం, తలనొప్పి రావడంతో 27వ తేదీన స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మంకీ పాక్స్ లక్షణాలేమీ లేకపోవడంతో వైద్యులు సాధారణ చికిత్సలే అందించారు. అలా చికిత్స పొందుతూనే ఆరోగ్య పరిస్థితి విషమించి.. శనివారం మరణించారు. కానీ ఆ యువకుడు యూఏఈలో ఉన్నప్పుడే జులై 19వ తేదీనే మంకీ పాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. ఆ రిపోర్టును కూడా వైద్యులకు ఇవ్వడంతో కలకలం మొదలైంది. యూఏఈ రిపోర్ట్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు మృతుడి నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపించారు. ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

ప్రస్తుతానికి కేరళలో మూడు కేసులు బయటపడగా, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. మొత్తం నాలుగు కేసులు అధికారికంగా భారత్ లో వెలుగు చూశాయి. ఇప్పుడు ఒక మరణం కూడా రికార్డ్ అయింది. తొలి కేసు వెలుగు చూసిన కేరళలోనే తొలి మరణం రికార్డ్ కావడం కూడా ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో రెండు అనుమానిత కేసులు వచ్చినా.. ఇంకా వ్యాధి నిర్థారణ కాలేదు. ఈలోగా ఇప్పుడు కేరళలో తొలి మరణం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

SHARE