కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని గులాం నబీ ఆజాద్‌ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌..తాజాగా తాను రాజీనామా చేయడానికి కారణాలు ఏంటో తెలిపి షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తను అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని, అందుకే పార్టీని బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆజాద్ ఆరోపించారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం తొలిసారి ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ-23 గ్రూప్‌లో చేరినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి తనతో సమస్య ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై విరుచుకుపడ్డ ఆజాద్ తాజాగా మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీలో తనను టార్గెట్​ చేశారన్నారు. ఇప్పుడు తన రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సాకుగా చూపుతున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.

“కాంగ్రెస్‌లోని కొందరు స్వార్థపరులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, ఎవ్వరూ ప్రశ్నించకూడదని వారు అనుకున్నారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయి, కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేదు” అని ఆజాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్​కు ఔషధాలు అవసరమని, అయితే వాటిని డాక్టర్​కు బదులుగా కాంపౌండర్లు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆజాద్. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు.

SHARE