గుజరాత్ లో ఘోరం : కల్తీ మద్యం తాగి 25 మంది మృతి

గుజరాత్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి చెందగా..మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఆదివారం మద్యం సేవించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోటాడ్ జిల్లాలోనే 16 మంది మృతి చెందగా.. ధందూకాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అహ్మదాబాద్‌కు తరలించారని ధందూక వైద్యాధికారి డాక్టర్ సంకేత్ చెప్పారు. భావ్‌నగర్‌లో కూడా నలుగురు చనిపోయినట్టు తెలుస్తుంది.

బోటాడ్ జిల్లాలోని రోజిద్, ధందుక, భావ్ నగర్ ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం సేవించారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. అలా అనారోగ్యం పాలైన 47 మందిని మంగళవారం ఉదయం బర్వాలా తాలూకా నుంచి భావ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే కొందరు మృతి చెందారు. బోటాడ్, బర్వాలాలోని ఆస్పత్రుల్లో మరి కొంతమంది చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

గుజరాత్, బొతాద్ జిల్లాలో స్థానికులు కొందరు ఆదివారం కల్తీ మద్యం సేవించారు. సోమవారం ఉదయంకల్లా వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు వీరిని దగ్గర్లోని భావ్‌నగర్, బొతాద్, బర్వాలా పట్టణాల్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. ఇలా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో, వేర్వేరు పట్టణాల్లో స్థానికులు ఆస్పత్రి పాలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందరూ ఒకే తరహా మద్యం సేవించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంచనాకు వచ్చారు. పోలీసుల అంచనా ప్రకారం.. ఈ మద్యాన్ని స్థానికంగా ఒక వ్యాపారి అక్రమంగా తయారు చేసి అమ్ముతున్నాడు. బాధితులు సేవించిన మద్యంలో మిథైల్ శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి.

SHARE