భారత 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసారు. అంతకు ముందు ఉదయం ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు. రాజఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆమెకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ భవనంకు వచ్చిన ద్రౌపది ముర్ము ను ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా లు పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు తీసుకుని వెళ్లారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. దీంతో భారత్ కు 15వ రాష్ట్రపతి అయ్యారు. ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. అలాగే, అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు వ్యక్తి కూడా కావడం గమనార్హం. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ ప్రమాణస్వీకారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్,తమిళి సై సౌందర రాజన్ హాజరయ్యారు.

SHARE