రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం హైలైట్స్

భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత విజయం కాదని.. దేశంలోని గిరిజన, దళితుల విజయమని పేర్కొన్నారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని, బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం మరింత బలాన్నిస్తుందన్నారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సమయంలో రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓ సాధారణ ఆదివాసీ మహిళ అయిన తాను దేశ అత్యున్నత స్థానానికి చేరుకోవడం ప్రజాస్వామ్యం గొప్పదనమని పేర్కొన్నారు.

గతంలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారంతా ఆ పదవికే వన్నె తెచ్చారని.. తాను కూడా వారి బాటలోనే పయనిస్తానని ద్రౌపది ముర్ము అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంకల్పంతో ముందుకెళ్లాలని.. వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు చదువుకోవడం తన కల అని, తమ గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలిక తానేనని తెలిపారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఉత్స‌వాల వేళ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌కావ‌డం సంతోషంగా ఉందన్నారు. పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది. దేశ ప్ర‌జ‌ల విశ్వాసం నిల‌బెట్టుకునేలా పనిచేస్తాన‌న్నారు. దేశంలో మ‌రింత వేగంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉందన్నారు. పేద‌లు కూడా త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు అని త‌న‌తో రుజువైంద‌న్నారు. మీ న‌మ్మ‌కం, మ‌ద్ద‌తు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించేందుకు త‌న‌కు శ‌క్తినిస్తుంద‌న్నారు. భార‌త్‌ స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత పుట్టిన తొలి రాష్ట్ర‌ప‌తిని తానే అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లు అభివృద్ధిలో వేగం పెంచాల‌న్నారు.

SHARE