ముర్ముకు దేశ‌వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు..

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ ఢంకా మోగించారు. ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ నేత‌ల సంబ‌రాల‌కైతే హ‌ద్దే లేకుండా పోయింది. దేశ‌వ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబ‌రాల‌ను మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని ముర్ము నివాసానికి బీజేపీ అగ్ర నేత‌లు క్యూ క‌ట్టారు. ప్రధాని మోడీ స్వయంగా ముర్ము నివాసానికి వెళ్లి అభినందలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు. మోడీ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా కూడా వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెళ్లి.. ముర్ముకు అభినంద‌న‌లు తెలిపి త‌న చేతుల‌తో ఆమెకు మిఠాయి తినిపించారు. అలాగే ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ము నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా ప‌రిణ‌తి క‌లిగిన రాజ‌కీయ నేత‌గా త‌న‌ను తాను నిరూపించుకున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌‌ల్లో తుది ఘ‌ట్ట‌మైన ఓట్ల లెక్కింపులో లెక్కింపు పూర్తి కాకుండానే విజ‌యానికి స‌రిప‌డ ఓట్ల‌ను సాధించిన అధికార ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుండ‌గానే ఆయ‌న త‌న ఓట‌మిని అంగీక‌రించారు. ఇక ఏపీ సీఎం జగన్ సైతం ముర్ము కు శుభాకాంక్షలు అందజేశారు. అలాగే తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ముర్ము విజయం ఫై తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపితోనే సాధ్యమైందన్నారు.ఈ ఎన్నికలో తనకు ఓటేసే అవకాశం రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం దేశ ప్రజల విజయమని అన్నారు.

SHARE