ఆర్జేడీ నేతల ఇళ్లల్లో సీబీఐ దాడులు

బిహార్‌లో మహా గట్‌బంధన్‌ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్‌ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. రైల్వే ఉద్యోగాల స్కాం కేసులో RJD నేతల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. RJDకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, ఎంపీల నివాసాల్లో సోదాలు చేపట్టింది. పాట్నాలోని సుబోధ్ రాయ్, సునీల్ సింగ్, అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్ ల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్‌ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ అష్ఫాఖ్‌ కరీమ్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్‌ రాయ్‌ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్‌ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు.

యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసారు. ఆ టైంలో రైల్వే నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. రైల్వేలోని వివిధ జోన్లలో ఉద్యోగాలు ఇప్పించినందుకు అభ్యర్థుల నుంచి నామమాత్రపు ధరలకే భూములు తీసుకున్నట్లు కేసు నమోదైంది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్ లపై సీబీఐ కేసులు నమోదు చేసింది . ఇదే కేసులో మిసా భారతిని అరెస్టు చేయగా.. లాలూ OSD గా పనిచేసిన భోలా యాదవ్ ను అదుపులోకి తీసుకుంది.

SHARE