సింగర్ సిద్ధూ హత్య కేసులో ఇద్దరు నిందితులు హతం

సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్‌ జగ్దీప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా లను పోలీసులు కాల్చి చంపారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ కు సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు.

సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్‌ జగ్దీప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా అమృత్‌సర్- పాకిస్థాన్ సరిహద్దు అట్టారికి సమీపంలోని చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు అక్కడ తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసిన గ్యాంగ్‌స్టర్స్ వారిపై కాల్పులు జరిపారు.దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా ఈ కాల్పుల్లో మూసేవాలా హత్యతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్‌ జగ్దీప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా లు హతమయ్యారు.

ఘటనాస్థలంలో ఏకే 47రైఫిల్, పిస్తోలుతో పాటు భారీ సంఖ్యలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. ఓ జర్నలిస్టు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. సిద్ధూ మూసేవాలా (28) మే 29న దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆయణ్ని అడ్డగించి బుల్లెట్ల వర్షం కురిపించారు. మన్నూ కూసా తుపాకీ నుంచే తొలి బుల్లెట్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

SHARE