రాజ్యసభ నుండి 19 మంది ఎంపీలు సస్పెన్షన్

రాజ్యసభ నుండి 19 మంది ఎంపిలఫై సస్పెన్షన్​ వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వారందరిపై వేటు వేసింది. ఈ వారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, కనిమొళి, మౌసుమ్‌ నూర్, శాంతా ఛెత్రీ, నదీముల్‌, రహీమ్‌, గిరిరాజన్‌ ఉన్నారు. ముగ్గురు టీఆరఎస్ ఎంపీలు సైతం ఉన్నారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందున.. సభను మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు.

ఇక సోమవారం లోక్​సభలో కాంగ్రెస్​కు చెందిన నలుగురు సస్పెండ్ అయ్యారు. ధరల పెరుగుదల అంశంపై నిరసనలు చేస్తూ లోక్‌సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు వీరిపై సస్పెన్షన్​ వేటు పడింది. స్పీకర్​ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వారిని.. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని లోక్​సభ తీర్మానించింది.

SHARE