రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ ఢంకా..

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయ ఢంకా మోగించారు. ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. మూడో రౌండు కౌంటింగ్ పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ము 50శాతానికి పైగా ఓట్లు సాధించారు. ఈ నెల 18న ఓటింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు హౌస్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్​లో మొత్తం 748 మంది ఎంపీల ఓట్లను లెక్కించారు. ద్రౌపది.. 3,78,000 విలువైన 540 ఓట్లు దక్కించుకున్నారు. సిన్హాకు 1,45,600 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.

సెకండ్ రౌండ్​లో ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు, 1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పడ్డాయి.మూడో రౌండ్‌ ముగిసే సమయానికి ద్రౌపదీ ముర్ము 50శాతం మార్కును దాటారు. మూడో రౌండ్‌లోనూ ద్రౌపదీముర్ముకు ఆధిక్యాన్ని కనబర్చారు. మూడో రౌండ్‌లో ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు పోలయ్యాయి. దీంతో ద్రౌపదీముర్ముకు పోలైన మొత్తం ఓట్ల విలువ 5,77,777 కాగా.. యశ్వంత్‌ సి‌న్హాకు పోలైన మొత్తం ఓట్ల విలువ 2,61,062. జులై 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠం అధిరోహించనున్నారు.

SHARE