ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన మోడీ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని, ఎర్రకోటపై 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని ప్రధాని మోడీ అన్నారు. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని, బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అసమానమని కొనియాడారు. గాంధీ, చంద్రబోస్‌, అంబేద్కర్‌ వంటివారు మార్గదర్శకులన్నారు. మంగళ్‌పాండేతో ప్రారంభమైన సమరంలో ఎందరో సమిధలయ్యారని, అల్లూరి, గోవింద్‌గురు వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమన్నారు.

స్వతంత్రం వచ్చినప్పుడు భారత్‌ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్‌ నిలిచి గెలిచిందన్నారు. ప్రపంచ యవనికపై తనదైన ముద్రవేసిందని, సమస్యలకు ఎదురొడ్డి నిలిచిందన్నారు. ఆకలికేకల భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. వైజ్ఞానిక రంగంలో ఇండియా తన ముద్ర వేస్తున్నదని చెప్పారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడిందని తెలిపారు.

SHARE