కరోనా బారిన అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ కరోనా బారినపడ్డారు. ఈ మేర‌కు గురువారం రాత్రి అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా బారిన ప‌డ్డ బైడెన్‌కు స్వ‌ల్పంగానే వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపిన వైట్ హౌస్‌… ప్ర‌స్తుతం ఆయ‌న అధ్య‌క్ష భ‌వ‌నంలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని తెలిపింది. అయితే అక్కడి నుంచే ఆయన తన విధులను నిర్వర్తిస్తారని తెలిపింది. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తో పాటు ఇటీవ‌లే బూస్ట‌ర్ డోస్‌ను కూడా బైడెన్ తీసుకున్నారు. అయినా కూడా ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌టం గ‌మ‌నార్హం.

వైట్ హౌస్ సిబ్బందితో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నారన్నారు. ఆయన పాల్గొనవలసిన సమావేశాల్లో తన నివాసం నుంచి ఫోన్, జూమ్ ద్వారా పాల్గొంటారన్నారు. జో బైడెన్ ఇటీవల సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌లలో పర్యటించారు. బుధవారం ఆయన మసాచుసెట్స్‌లో పర్యటించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ అమలు గురించి మాట్లాడారు. గన్ సేఫ్టీ, నేరాలపై పెన్సిల్వేనియాలో గురువారం ప్రసంగించవలసి ఉంది. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని రోజూ తెలియజేస్తామని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది. జో బైడెన్ సతీమణి జిల్‌కు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపింది.

SHARE