మాల్దీవుల్లో తలదాచుకున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవుల్లో తలదాచుకున్నాడు. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవులకు పరారయ్యారు. భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్‌తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్‌కు చెక్కేశారు. అక్కడి ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది.

ప్రజల నిరసనల నేపథ్యంలో రాజీనామాన చేస్తానని గొటబయ ఇప్పటికే ప్రకటించారు. అయితే తనకు గొటబయకు సంబంధించిన రాజీనామా లెటర్ ఇంకా అందలేదని స్పీకర్ చెబుతున్నారు. శ్రీలంక ఆర్ధిక శాఖ మంత్రి, గొటబయ సోదరుడైన బాసిల్ రాజపక్స కూడా దేశం విడిచి పారిపోయారు. గొటబయ దేశం విడిచి పారిపోయేందుకు భారత్ సహకరించిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలంకలోని భారత హైకమిషన్ అధికారులు స్పష్టం చేశారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల ఆందోళనలు ఉధృతం చేశారు. గొటబయ రాజపక్స దేశం నుంచి పారిపోవడంతో.. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన విక్రమసింఘే విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొలంబోలోని అధ్యక్ష నివాసం వద్ద ఆందోళన సృష్టించారు. దీంతో ఆర్మీ సైతం రంగంలోకి దిగి… కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిరసనకారులు లోనికి చొచ్చుకురావడంతో.. సైనికులు భాష్ప వాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసుల వాహనాలపైకి రాళ్లు రువ్వగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు.

SHARE