ఆటా సభల్లో బిజెపి ఫై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత

ఆటా సభల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత బిజెపి ఫై నిప్పులు చెరిగారు.. తాజాగా అమెరికాలో ఆటా (అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌) మహాసభలు జరిగాయి. ఈ సభల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ విభాగం తరఫున వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ శాఖల పనితీరును వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాల్లో శాఖలున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ నాయకత్వం అవసరమని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని తెలిపారు.

ఇక ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థలను తన స్నేహితుడు అదానీకి కట్టబెడుతున్నారని, అసలు దేశానికి ప్రధానిగా మోడీ ఉన్నారా? అదానీ ఉన్నారా? అనే అనుమానం కలుగుతుందన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్‌ అని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్‌ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవని తెలిపారు. దేశానికి పన్నుల రూపంలో అత్యధిక వాటా తెలంగాణ ఇస్తున్నదని గుర్తుచేశారు. బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు.

ఇక ఈ సభలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామ‌కూర మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గాద‌రి కిశోర్‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గువ్వల బాలరాజు, క్రాంతి కిర‌ణ్‌, బొల్లం మల్లయ్య, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, యూఎస్‌ఏ టీఆర్‌ఎస్‌ సభ్యులు పూర్ణ బైరి, నరసింహారావు నాగులవంచా, అనిల్ ఎర్రబెల్లి, రవి దన్నపనేని, సక్రు నాయక్, నవీన్ జలగం, జాగృతి సభ్యులు పాల్గొన్నారు.

SHARE