ట్విట్టర్ డీల్ ను రద్దు చేసుకున్న ఎలన్ మస్క్

ట్విట్ట‌ర్ సంస్థ‌ను కొనుగోలు చేయాల‌ని బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. సుమారు 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు దాన్ని ఆయ‌న సొంతం చేసుకోవాల‌నుకున్నారు. అయితే ఆ డీల్ నుంచి మ‌స్క్ త‌ప్పుకున్నారు. ట్విట్ట‌ర్‌తో అగ్రిమెంట్ సరైన రీతిలో లేద‌ని ఆయ‌న ఆరోపిస్తూ డీల్ ను రద్దు చేసుకున్నారు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ఎలాన్ మస్క్ ఏప్రిల్ 25న 54.20 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసారు. అయితే అది తరువాత 44 బిలియన్లకు డీల్ ఫైనల్ అయింది. మే నెల‌లో ఆ డీల్‌పై మ‌స్క్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఫేక్ అకౌంట్ల నేప‌థ్యంలో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు తెలిపారు. మొత్తం యూజ‌ర్ల‌లో ఫేక్ లేదా స్పామ్ యూజ‌ర్లు కేవ‌లం 5 శాతం లోపు మాత్ర‌మే ఉన్నార‌న్న విష‌యాన్ని నిరూపించాల‌ని మ‌స్క్ కండీష‌న్ పెట్టారు. అయితే ట్విట్ట‌ర్ సంస్థ ఆ స‌మాచారాన్ని ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఈ ఒప్పందం నుండి వైదొలగిన తరువాత, ట్విట్ట‌ర్ స్పందించింది. ట్విట్టర్ ఇప్పుడు ఎలాన్ మస్క్‌పై దావా వేయడానికి సిద్ధమవుతోంది. మ‌స్క్‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. మ‌స్క్ అంగీక‌రించిన ధ‌ర‌కు, ష‌ర‌తుల‌కు లోబ‌డే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ట్విట్ట‌ర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేల‌ర్ తెలిపారు.

SHARE