చంద్రబాబు పర్యటనలో పెనుప్రమాదం తప్పింది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుండగా పెను ప్రమాదం తప్పింది. టీడీపీ నేతల పడవ గోదావరిలో బోట్ల పడింది. దీంతో టీడీపీ నేతలంతా నీటిలో పడ్డారు. అప్పుడే చంద్రబాబు మరో పడవలోకి వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈరోజు సాయంత్రం రాజోలులంక చేరుకున్న క్రమంలో పడవ ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటులో నుంచి దిగి రాజోలు లంక వెళ్లేందుకు మరపడవలోకి మారాల్సి వచ్చింది. మర పడవలో చంద్రబాబు వెళ్తుండగా… ఆయనతో పాటు మరో పడవలో టీడీపీ నేతలు వెళ్లేందుకు అందరూ ఒక్కసారిగా పంటు చివరకు రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నేతలంతా నీటిలో పడ్డారు.

ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్‌జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అయితే ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

SHARE