టీడీపీ నేత వరుపుల రాజా కోసం పోలీసుల గాలింపు

టీడీపీ నేత వరుపుల రాజా కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. వ‌రుపుల రాజా గ‌తంలో డీసీసీబీ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న హ‌యాంలో ప‌లు సొసైటీల్లో నిధుల గోల్‌మాల్ జ‌రిగిందంటూ సీఐడీ గ‌తంలో ఓ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో పోలీసులు త‌న‌ను అరెస్ట్ చేయ‌కుండా నిలువ‌రిస్తూ హైకోర్టును ఆశ్ర‌యించిన వ‌రుపుల రాజా… ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఇంకో సొసైటీలో నిధుల గోల్‌మాల్ ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు… శుక్ర‌వారం ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్ర‌త్తిపాడులోని ఆయ‌న ఇంటికి చేరుకున్నారు.

వ‌రుపుల రాజాను అరెస్ట్ చేయ‌డానికి పోలీసులు వ‌చ్చార‌ని తెలుసుకున్న ఆయ‌న అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. అయినా తాను హైకోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నాన‌ని స‌ద‌రు ప‌త్రాన్ని రాజా పోలీసుల‌కు చూపారు. అయితే తాము ఈ కేసులో రాలేద‌ని, మ‌రో కేసు విష‌య‌మై వ‌చ్చామ‌ని పోలీసులు తెలిపారు. దీంతో త‌న‌ను అరెస్ట్ చేయ‌డం త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన వ‌రుపుల రాజా… పోలీసుల‌తో చ‌ర్చ‌లు కొన‌సాగిస్తున్న‌ట్లుగానే న‌టిస్తూ… ఇంటి వెనుక వైపు నుంచి ప‌రార‌య్యారు. ప్రస్తుతం రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

SHARE