మా గ్రామాలను తెలంగాణలో కలపండి అంటూ ఏపీ ప్రభుత్వానికి వినతి

తెలంగాణ – ఏపీ మధ్య ఇప్పుడు ఐదు గ్రామాల గొడవ నడుస్తుంది. తెలంగాణలో విలీనం చేయాలంటూ 5 పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. కన్నాయిగూడెం, పిచుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. గోదావరి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు. ఈ ఐదు గ్రామాలు ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గంలోకి వస్తాయి. రంపచోడవరం 120కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల తమ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఎనిమిదేళ్లుగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. అందువల్ల తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి.

ప్రతి సంవత్సరం గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయం చేయాలని ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం ముంపునకు గురి కాకుండా ఉండాలంటే ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత వివాదం మరింత ముదిరింది. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడడానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మరి ఇప్పుడు ఈ ఐదు గ్రామాలు తీర్మానం చేయడం తో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

SHARE