వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్‌ ఫై తిరగబడ్డ గ్రామస్థులు

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలకు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది నేతలకు ప్రజల నుండి వ్యతిరేకత రాగ..తాజాగా ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్‌కు వెలిగండ్ల మండలంలోని పెరుగుపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. పెరుగుపల్లిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ హాజరయ్యారు.

గతంలో పెరుగుపల్లికి చెందిన 15ఎకరాల పశువుల బీడును కొంతమంది ఆక్రమించుకున్నారని, ఎన్నికల ముందు సమస్యను పరిష్కరిస్తామని మధుసూదన్ యాదవ్ హామీ ఇచ్చారు. తాజాగా, ఈ అంశాన్ని గ్రామస్థులు నిలదీశారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్‌ మంజుభార్గవిని అవమానపరిచేలా సమాచారం ఇవ్వకుండా హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమం నిర్వహించిన తీరుపై ఎమ్మెల్యేను కడిగిపారేశారు. పశువుల బీడును తిరిగి గ్రామానికి అప్పగిస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆ స్థలాన్ని గ్రామానికి అప్పగించేంత వరకు మా గ్రామంలోకి రావద్దంటూ తెగేసి చెప్పారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయినప్పటికీ గ్రామస్థులు తగ్గకపోవడంతో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని ఆపేసి వెనుదిరిగారు.

SHARE