నేటి నుండి నెల్లూరు లో రొట్టెల సంబరాలు

నెల్లూరు లో రొట్టెల సంబరాలు మొదలయ్యాయి. మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు.

ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికలలో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.

ఆరోగ్యం గురించి మొక్కు కొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె…ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు. నెల్లూరు జిల్లాలో ఈ పండగ మొదలైంది. ఈ నెల 13 వరకు ఈ సంబరాలను జరుపుకుంటారు. ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. ముఖ్యంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను గత 2015 నుంచి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

SHARE