వైస్సార్సీపీ లో చేరిన టీడీపీ నేత గంజి చిరంజీవి

ఏపీలో టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళ గిరి నియోజక వర్గంలో కీలకంగా ఉన్నటు వంటి టీడీపీ నేత గంజి చిరంజీవి వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మధ్యనే టీడీపీ కి రాజీనామా చేసిన ఈయన..ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. వైసీపలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటూ వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్‌ పదవులతో పాటూ రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు చిరంజీవి. జగన్‌ సారంథ్యంలోనే పనిచేసేందుకు ఆసక్తి ఉండే.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నానని స్పష్టం చేశారు.

ఇకపోతే.. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిపడ్డారు. నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజికవర్గానికి టీడీపీలో గౌరవం లేదని విమర్శించారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

SHARE