రాత్రికిరాత్రే రైతు లక్షాధికారి అయ్యాడు

కర్నూల్ జిల్లాలో రాత్రికిరాత్రే రైతు లక్షాధికారి అయ్యాడు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అధిక భాగం ఎర్ర నేలలున్నాయి. ఈ ఎర్రనేలల్లో తొలకరి చినుకులు కురిసిన తరవాత వజ్రాలు దొరుకుతుంటాయి. వీటి కోసం అనేక మంది ప్రజలు వేట సాగిస్తుంటారు. రాత్రిబవళ్లు పంటపొలాల్లో ఉంటూ వజ్రాలను దక్కించుకుంటుంటారు. దాదాపు 40 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో వాటి అన్వేషణ కొనసాగుతోంది. మొదట్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి వజ్రాలు దొరికాయి. క్రమంగా ఇది వేటగా మారి పోయింది. అదృష్టం వరిస్తే క్షణాల్లో లక్షాధికారులు అవుతుంటారు.

తాజాగా కర్నూల్ జిల్లాలో అలాగే జరిగింది.పొలంలో పనిచేసుకుంటున్న జొన్నగిరి రైతుకు ఓ వజ్రం దొరికింది. నిన్న ఉదయం పొలంపని చేసుకుంటున్న రైతు చేతికి ఓ వజ్రం చిక్కింది. వెంటనే ఆ వజ్రాన్ని బంగారం షాప్ అతడికి చూపించగా.. వెంటనే అతడు రూ. 25 లక్షలు ఇచ్చి దానిని సొంతం చేసుకున్నాడు. బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ. 40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. గతేడాది కూడా జొన్నగిరికి చెందిన ఓ రైతుకు రూ.1.20 కోట్ల విలువైన డైమండ్‌ దొరికింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన వజ్రం.

SHARE