విపత్తు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే జగన్ పన్నుల భారం వేస్తున్నాడు – చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఈరోజు ఉదయం ఏలూరు చేరుకున్న బాబు..పెనుగొండ మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ… విపత్తు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే జగన్ పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధిక అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. దేశంలో అధిక ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉభయగోదావరి జిల్లాల్లో చేస్తే స్థానిక నాయకులు వడ్డీతో సహా చెల్లించాలని చంద్రబాబు తెలిపారు.

శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ, అందుకే ఇంకా తిరుగుబాటు చేయలేదన్నారు. బాదుడే బాదుడు అంటూ జగన్ రెడ్డి సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ గేర్లో జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. 72శాతం పూర్తి అయిన పోలవరాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ముంపు మండలాల ప్రజలను ఈ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్న చంద్రబాబు.. వాటికి భయపడేది లేదని.. గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.

SHARE