పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పుల చిట్టాను బయటపెట్టిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టాను కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అనుమతి ఇచ్చిన అప్పుల్లో మూడు నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు కేంద్రం మరోసారి బయటపెట్టింది. రాష్ట్రం చేసిన అప్పుల గురించి..టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

కేంద్రం, నాబార్డ్ (NABARD) నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్లు తెలిపింది. 202‌2-23 ఆర్ధిక సంవత్సరంలో ఏపీకి నికర రుణ పరిమితి కింద రూ.44574 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని పేర్కొంది. మొదటి 9 నెలలకు రూ. 40,803 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఏప్రిల్ నాటికే అంటే మొదటి మూడు నెలల్లోనే సుమారు 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ వరకే… రూ.21890 కోట్లు రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఇది కాక కేంద్రం నుంచి మరో రూ.1373.47 కోట్లు రుణం ఏపీ తీసుకున్నదని తెలిపింది. నాబార్డ్ నుంచి ఏపీ రూ.40.17 కోట్లు అప్పు చేసినట్లు వెల్లడించింది.

SHARE