శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి భారీగా వరదనీరు వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,64,683 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టులో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 3,39,948 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.30 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211 టీఎంసీల నీరు ఉంది. నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 1,36,307 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సుంకేసల నుంచి 1,23,409 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఇక శ్రీశైలం ఎడమ కాల్వకు 31,784 క్యూసెక్కులు, కుడికాల్వకు 30,456 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా, స్పిల్‌వే ద్వారా 2,23,128 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.

మరోపక్క నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 580 అడుగుల మేర నీరున్నది. డ్యామ్‌ గరిష్ఠ నిల్వసామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 283.01.60 టీఎంసీల మేర నిల్వ ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,818 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 2570 క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

SHARE